Tumgik
bairapagajohn · 7 years
Text
Story of Digital John - India
నా పేరు బైరపాగ జాన్. మాది మహబూబ్ నగర్ జిల్లా, గుమ్మకుండా గ్రామం.  నాన్నTSRTC లో  బస్సు కండక్టర్, అమ్మ అంగన్ వాడి   టీచర్.
నా బాల్యం
1993 వ సంవత్సరం ,అక్టోబర్ 9 వ తారీఖున నేను  హైదరాబాద్ లో ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్ లో జన్మించాను. చిన్నప్పుడు లావుగా ఉన్నానని నాకు లడ్డు అని ముద్దు పేరు పెట్టారు. నాకు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన చిన్నఅగ్ని ప్రమాదం వల్ల దేహం వీపు భాగం కాలి పోయింది.కొన్ని నెలలకి కోలుకున్నప్పట్టికీ  , లావుగా వుండవలిసిన వాడిని సన్నగా   చేసింది ఆ ప్రమాదం. బాల్యం అంతా మా సొంత ఊరు గుమ్మకొండ లో గడిచింది. పదవ తరగతి వరకు అక్కడే  చదువు కున్నా.
విద్యాబ్యాసం
చదువు అంటే అసలు ఆసక్తి ఉండేది కాదు కేవలం పరీక్ష పాస్ అవ్వడానికి చదివే వాడిని ,గణితం కొంచెం కూడా అర్ధం అయ్యేది  కాదు. ఇంగ్లీష్ చదవడం రాదు నాకు నచ్చిన సబ్జెక్టు ఒక్క తెలుగు మాత్రమే. ఆ రోజుల్లో మాకు తెలుగు వార్త పత్రికలే మాకు వున్న ఏకైక మాధ్యమం . రేడియోలు ,టీవీ లు  ఉండేవి కానీ చాలా తక్కువ. తెలుగు వార్తా  పత్రికలను  చదవడం ద్వారా తెలుగు భాషపై  మంచి పట్టును సాదించగలిగాను. నాకు ఎక్కువ  మార్కులు కూడా తెలుగులోనే  వచ్చేవి. బడికి రోజు వెళ్ళేవాడిని. చదువు తప్పా అన్ని చేసేవాడిని.   క్రీడలలో, వ్యాస రచన, చిత్ర లేఖనం  మొదలగు పోటీలలో  చురుగ్గా పాల్గొనేవాడిని. చదరంగం  నాకు చాల ఇష్టమైన ఆట. ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు స్కూల్ లో 9 వ మరియు 10 వ  తరగతి  సీనియర్ విద్యార్థులు సునాయాసంగా  ఓడించాను. మంచి చదరంగం అటగాడిగా గుర్తింపు వచ్చింది. క్రికెట్ ఎక్కువగా  ఆడే వాడిని. వేసవి సెలవులు వచ్చాయి అంటే చాలు, రోజు క్రికెట్ ఆడే వాడిని, ఈత కొట్టడం లో మంచి నైపుణ్యం  వుంది ఈతకు  కూడా రోజు వెళ్ళేవాడిని.ఒక గ్రామంలో సగటు విద్యార్థి ఎదురుకొనే అన్ని సమస్యల గుండా వెళ్ళాను. ఎట్టకేలకు 2009 వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసాను.
10 వ తరగతి తరువాత ఇంటర్మీడియేట్ లో MPC కానీ, Bi.P.C  కానీ చదవాలని ఇంట్లో తీవ్ర ఒత్తిడి. నాకేమో ఆ రెండు రావు.  నాన్నను C.E.C గ్రూప్ తీసుకుంటాను అని ఒప్పించాను.  కుటుంబ సమస్యల వల్ల హైద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఒక చిన్న జూనియర్ కాలేజీ లో C.E.C గ్రూప్ తీసుకొని చదివాను.60% శాతం మార్కులతో C.E.C పూర్తి చేశాను (2009 -2011).  ఇంట్లో తీవ్ర ఆర్ధిక సమస్యల వల్ల ఇంటర్మీడియేట్ చదవనేమో అని అనుకున్నాను. ఆర్థిక సమస్యలు చాలానే ఉండేవి.  డబ్బు విలువ, సమయం విలువ తెలిసిన ఒక పరిపక్వత కలిగిన విద్యార్థిగా చదువుకునేవాడిని. హైద్రాబాద్ లో ఆహారం అతిపెద్ద సమస్యగా ఉండేది. అయినా అలాగే సర్దుకు పోయావాడిని ఎన్నోసార్లు ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ లపై ఆధారపడాల్సి వచ్చింది.  
2011 - కంప్యూటర్ హార్డ్ వేర్ (డిగ్రీ వద్దు)
మళ్ళీఆర్ధిక ఇబ్బంది .డిగ్రీ చదవాలని అనిపించలేదు. ఏదో ఒక వృత్తి రీత్యా పని నేర్చుకోవాలని నిర్ణయించుకున్న. ఏదైనా కోర్స్ నేర్చుకోవాలని దిల్ సుఖ్ నగర్ మొత్తం తిరిగాను, మొబైల్ రిపేర్ నేర్చుకుందాం అనుకున్న, కానీ మొబైల్ రిపేరింగ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ ఆ రోజు మూసి ఉండడంతో  నా అడుగులు కంప్యూటర్ రిపేరింగ్ వైపు పడ్డాయి. పైగా కంప్యూటర్ రిపేర్ చేసే వాళ్ళని హార్డ్ వేర్ ఇంజనీర్ అని అంటారు . అప్పుడు నేను ఒక జెట్కింగ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకున్న .  జెట్ కింగ్ ఇన్స్టిట్యూట్ కి  వెళ్ళాను, అడ్మిషన్ కౌన్సిలర్ తో మాట్లాడాను , కోర్స్ గురించిన వివరాలు, ఒక ఫారం ఇచ్చి నన్ను నింపమని చెప్పింది . అందులో  అప్పుడు నాకు ఇమెయిల్ అంటే  తెలియదు. అపుడు నాకు ఇమెయిల్ లేదు. వెబ్ సైట్ అంటే కూడా ఏమిటో తెలియదు అప్పుడు .
రోజులు గడుస్తున్నాయి కంప్యూటర్ హార్డ్ వేర్  నేర్చుకుంటున్న. సరిగ్గా అదే సమయం లో శివ అనే మిత్రుడు పరిచయం అయ్యాడు . శివ నాకు కంప్యూటర్ హార్డ్ వేర్ తో   పాటు అనేక కంప్యూటర్ కు సంబందించిన విద్య లు నేర్చుకోవడం లో తోడ్పడాడు. దాంతో నేను కంప్యూటర్ హార్డ్ వేర్ మాత్రమే కాకుండా, ఇతర కంప్యూటర్ పనులు కూడా నేర్చుకున్నాను. వాటిలో కొన్ని- ఫోటోషాప్, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, ఇంటర్నెట్ విజ్ఞానం, మొదలగువాటిని నేర్చుకున్నాను.
బస్సు పాస్ కోసం డిగ్రీ కాలేజీ లో చేరాను
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, హైదరాబాద్ లో తిరగడానికి స్టూడెంట్ పాస్ కోసం సర్ధార్ పటేల్ డిగ్రీ కాలేజీ లో చేరాను. స్టూడెంట్ బస్సు  పాస్ ,అదే నా డెబిట్ & క్రెడిట్ కార్డు. డిగ్రీ మొదటి సంవత్సరం అంతా హార్డ్ వేర్  & నెట్వర్కింగ్ కోర్స్ నేర్చుకున్నాను. కాలేజీ కి వెళ్ళేవాడిని   కాదు. నెల కు ఒక్క రోజు వెళ్ళేవాడిని. అది కూడా బస్సు పాస్ రెన్యువల్ కోసం కాలేజీ స్టాంప్ కోసం.  డిగ్రీ మొదటి సంవత్సరం తో పాటు జెట్ కింగ్  లో హార్డ్ వేర్ కోర్స్ పూర్తి అయింది. జెట్ కింగ్ లో క్యాంపస్ ప్లేసెమెంట్ లో ఇంటర్వ్యూ ఎదురుకునే  నైపుణ్యం, సామర్ధ్యం ఉన్నప్పటికీ, డిగ్రీ పూర్తి కాకపోడం తో చాలా కంపెనీ లు నన్ను తీసుకోలేక పోయాయి.
డిగ్రీ రెండవ సంవత్సరం లో నా  ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చిన్న AMC కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాలేజీకి మళ్ళీ దూరం .14 నేలలు ఉద్యోగం చేశాను . తరువాత రాజీనామా చేసి డిగ్రీ పై దృష్టి పెట్టాను. కాలేజీ కి వెళ్ళకపోవడం వల్ల సబ్జక్ట్స్ అన్నీ తప్పాను. వాటి కోసం ట్యూషన్ కి వెళ్ళేవాడిని. ఒక సబ్జెక్టు సగటున మూడుసార్లు రాసి పాసయ్యాను. 2014 డిసెంబర్ 53% మార్కులతో   పాసయ్యాను. డిగ్రీ తరువాత ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను.
నేను ఈ రోజు యీ స్థాయి ఉన్నానంటే ,దానికి కారణం కష్టాలే . కష్టాలే నన్ను ఇంకా ఎక్కువుగా కష్టపడేలాగా చేసాయి
కష్టాలు
హైదరాబాద్ లో   ఏడు సంవత్సరాలు. నిద్ర, ఆహారం, యీ రెండు  నాకు సరిగ్గా ఉండేవి కావు. ఏడేండ్లలో   తృప్తిగా అన్నం ఒక్క సారి  కూడా తినలేదు. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు  అన్నం తిన్నావా అని అడిగేతే ఫోన్ కట్ చేసేవాడిని. ఆ తరువాత ఫోన్ ఎత్తడమే మానేసాను, కేవలం అన్నం తిన్నావా అని అడిగే ప్రశ్న కోసం. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, 90% ఇవే నా ఆహారం . ఇక నిద్ర విషయానికొస్తే ఎప్పుడూ ఎదో ఒక్క కంప్యూటర్ కోర్స్ నేర్చుకొనేవాడినే.  రాత్రి బాగా అలసిపోయే వరకు కంప్యూటర్ లో ఏదో ఒక పని చేసేవాడిని.  నా సగటు నిద్ర సమయం 3 గంటలు (ఇప్పుడు కూడా).
ఉన్నత  విద్యకు శంకుస్థాపన
2014 డిసెంబర్ లో ఉస్మానియా యూనివర్సిటీ  విడుదల చేసిన సప్లిమెంటరీ ఫలితాలలో నేను ఉత్తీర్ణుడిని అయ్యాను. దాంతో నా డిగ్రీ కల నెరవేరింది.  2015 లో వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది  ఒక్క చిన్న ఇన్స్టిట్యూషన్ లో, అది కూడా ప్రస్తుతం వాడని సాఫ్ట్ వేర్. కొని నెలలు వృధా అయ్యాయి. ఖాళీగా వున్నాను. 2015 - మొత్తానికి విజయవంతంగా  వృధా చేసాను. తరువాత ఏం చెయ్యాలి ? ఉద్యోగమా? ఉన్నత విద్యా ?  హార్డ్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తే కనీసం 10000 సంపాదించవచ్చు. అనుభవం కొద్ది మంచి ఎదుగుదల వుంటుందా అంటే, అదీ లేదు. ఉద్యోగం  తరువాత అయినా  చేసుకోవచ్చు , కానీ పై చదువులు ఇప్పుడే చదవాలని  అనుకున్నాను.
ఆ టైంలో  నా తోటి స్నేహితులు , ఊళ్లో విద్యార్థులు గ్రూప్స్ కి సిద్ధమవుతున్నారు. కొందరు SI & కానిస్టేబుల్ కి, ఇంకొందరు B.Ed చేస్తున్నారు. నన్ను గ్రూప్స్ కి కోచింగ్ తీసుకోమని చాలా మంది సలహా ఇచ్చారు . నాకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇష్టం ఉండేది కాదు. ప్రైవేట్ రంగంలో నేను రాణించగలను అనే ఆత్మ విశ్వాసం ఉండేది.
MBA
MBA చేద్దామనుకున్నా. I-CET ప్రవేశ పరీక్ష రాసిన. ఆ సంవత్సరం 80 వేల మంది పరీక్ష రాస్తే, నాకు 80  వేల ర్యాంకు వచ్చింది . అది నా చదువు. అంతా మన మంచికే అనుకున్నాను. రాష్ట్రము లో మంచి MBA కాలేజీ లు  లేవు అని తెలుసు . కొని మంచి ప్రైవేట్ కాలేజీ లు వున్నాయి కానీ, నా ఆర్థిక స్థోమత దానికి సహకరించదు.  నాలాంటి విద్యార్థికి , మార్కులను బట్టి  కాకుండా, ప్రతిభను బట్టి  అడ్మిషన్ ఇచ్చే తక్కువ ఫీజు గల MBA కాలేజీ కోసం కొన్ని నెలలు ఆన్లైన్ లో సెర్చ్ చేశాను . కాలేజీ ల వెబ్సైటు కి వెళ్లడం , నా వివరాలు ఇవ్వడం , తరువాత  వాళ్ళు ఫోన్ చేస్తుంటే కాలేజీ గురించి తెలుసుకోవడం. ఇదే నా దినచర్య .అలా ఒక రోజు వాన్ గార్డ్ బిజినెస్ స్కూల్ గురించి ఇంటర్నెట్ లో చూసాను. మంచి కాలేజీ. సమస్య ఏమిటంటే, నేను యీ  కాలేజీ లో చదవడానికి అన్ని విధాలా అనర్హుడిని. దానికి కారణాలు లేకపోలేదు. డిగ్రీ కాలేజీకి వెళ్లకుండా, కంప్యూటర్ హార్డ్ వేర్  వైపు వెళ్లడంతో , అసలు డిగ్రీలో నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు . ఇంక నా ఇంగ్లీష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . మంచి ఇంగ్లీష్ వస్తే  ఈ విషయాలు అని ఇంగ్లీష్ లోనే రాసే వాడిని. సందర్భాన్ని   బట్టి రెండు కారణాలు ఇచ్చాను . కానీ ఏ విధంగా చుసిన అనర్హుడిని.  అయినప్పటికీ, కాలేజీ లో చదువుకోవడానికి కాలేజీ యాజమాన్యం నాకు ఒక అవకాశం ఇచ్చింది.
అదే సమయం లో నాకు ఒక తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్ లో వీడియో ఎడిటర్ గా ఉద్యోగం వచ్చింది. 2016 సంవత్సరం ప్రారంభం లో నేను ప్రొఫిషనల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. అంతకుముందే ఫోటోషాప్ అండ్ తెలుగు టైపింగ్ రావడంతో   యీ ఉద్యోగం   వచ్చింది.  కాలం నన్ను పరీక్షించింది. ఎడిటర్ గా ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. MBA చదవడానికి బెంగళూరు బయలుదేరాను. 2016 జులై లో నా MBA ప్రారంభం అయింది . ప్రస్తుతం MBA చదువుతున్నాను,  అహర్నిశలు శ్రమిస్తున్న. MBA గురించి , చదువు పూర్తి అయ్యాక రాస్తాను.
ప్రస్తుతం నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ , ఇంకో పది మందికి ఇంటర్నెట్ ద్వారా నేర్పిస్తున్నాను.
4 notes · View notes
bairapagajohn · 7 years
Link
0 notes